కామారెడ్డి, 2026-06-20
కామారెడ్డిలో ఎక్సైజ్ అధికారుల ప్రత్యేక తనిఖీల్లో భారీ పట్టివేత
ఉమ్మడి నిజామాబాద్ డివిజన్ ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ కమిషనర్ రఘురామ్, కామారెడ్డి జిల్లా ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ అధికారి బి. హన్మంతరావు ఆదేశాల మేరకు కామారెడ్డి ఎక్సైజ్ స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు, జిల్లా టాస్క్ ఫోర్స్ సిబ్బంది సంయుక్తంగా ప్రత్యేక తనిఖీలు నిర్వహించారు. నమ్మదగిన సమాచారం మేరకు సంబల్ పూర్ నుండి నాందేడ్ వెళ్తున్న నాగవల్లి ఎక్స్ప్రెస్ (రైలు నం. 208091)లో ఈ తనిఖీలు చేపట్టారు.
ఎస్-7 బోగీలోని ఒక బెర్త్ కింద అనుమానాస్పదంగా ఉన్న రెండు బ్యాగులను అధికారులు గుర్తించారు. వాటిని పరిశీలించగా, మొత్తం 22 ప్యాకెట్లలో ఎండు గంజాయి ఉన్నట్లు నిర్ధారించారు. స్వాధీనం చేసుకున్న గంజాయిని తూకం వేయగా 20 కిలోల బరువు ఉన్నట్లు అధికారులు తెలిపారు. అయితే, గంజాయి తరలిస్తున్న వ్యక్తి ఆచూకీ లభించకపోవడంతో, నిందితుడి కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేసినట్లు వెల్లడించారు.
ఈ దాడుల్లో ట్రైనీ AES వి. అరుణ్ చంద్ర, డీటీఎఫ్ సీఐ సుందర్ సింగ్, ఎస్ఐలు విక్రమ్, శరత్ కుమార్, దీపిక, ట్రైనీ ఎస్ఐ మధుసూదన్, ఇతర సిబ్బంది పాల్గొన్నారు. ఈ ఘటనపై కామారెడ్డి ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసి, దర్యాప్తు కొనసాగిస్తున్నారు.





