కామారెడ్డి జిల్లాలో యువతి అనుమానాస్పద స్థితిలో మృతి చెందడం, మృతదేహం సెల్ టవర్ కింద లభించడం కలకలం రేపింది. పోలీసులు హత్య లేదా ఆత్మహత్య కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.
వివరాల్లోకి వెళితే, కామారెడ్డికి చెందిన ఆర్థికౌర్ (19) తన తల్లిదండ్రులతో కలిసి హైదరాబాద్‌లో నివాసం ఉంటోంది. వారం రోజుల క్రితం అమ్మమ్మ స్వగ్రామమైన కి వచ్చింది. శుక్రవారం అర్ధరాత్రి ఇంట్లో ఎవరికీ చెప్పకుండా బయటకు వెళ్లిన యువతి తిరిగి రాకపోవడంతో కుటుంబ సభ్యులు, బంధువులు ఆందోళనకు గురయ్యారు.
చుట్టుపక్కల ప్రాంతాల్లో గాలిస్తుండగా, అంగడి బజార్ సమీపంలోని సెల్ టవర్ కింద కుక్కలు ఎక్కువగా మొరుగుతుండటాన్ని గమనించారు. అక్కడికి వెళ్లి పరిశీలించగా, యువతి అప్పటికే మృతి చెంది కనిపించింది. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు.
పోలీసుల విచారణ
ఎస్సై మహేందర్ సిబ్బందితో కలిసి ఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కామారెడ్డి ఏరియా ఆసుపత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న ఎల్లారెడ్డి డీఎస్పీ శ్రీనివాసరావు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. సదాశివ నగర్ సీఐ వీరయ్య, డాగ్ స్క్వాడ్ సహాయంతో పోలీసులు పరిసర ప్రాంతాల్లో క్షుణ్ణంగా తనిఖీలు చేపట్టారు.
మృతురాలు ఆర్థికౌర్కు ఇటీవలే నిశ్చితార్థం జరిగినట్లు బంధువులు తెలిపారు. యువతి మృతి వెనుక అసలు కారణాలపై గ్రామంలో చర్చ జరుగుతోంది. ఎవరైనా హత్య చేశారా లేక సెల్ టవర్‌పై నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడిందా అనే కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
కేసు నమోదు చేసి, అన్ని కోణాల్లో విచారణ చేపట్టినట్లు పోలీసులు వెల్లడించారు. పోస్టుమార్టం నివేదిక, పోలీసుల దర్యాప్తులోనే మృతికి గల అసలు కారణాలు వెల్లడయ్యే అవకాశం ఉందని తెలిపారు.






